శీతాకాలం వచ్చేసింది. ఇక ప్రతి మగువ తమ చర్మాన్ని కాపాడుకోవటానికి ఎన్నో క్రీముల్ని అన్వేషిస్తుంది. పొడిబారి పగుళ్ళు ఏర్పడే సమస్య ప్రస్తుతం మగువలు ఎదుర్కొనే సమస్య. ఈ సమస్యలకు మన ఇంట్లొనే చిట్కాలు దాగి వున్నాయ్. వాటిని ఉపయోగించుకుంటే సరి. అవేంటో చూద్దామా మరి!

1.పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి.

2.మృదువైన చర్మం అయితే ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో… పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



మాస్క్ వేసుకునేటప్పుడు

1.పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా… అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.

2.మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే… చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

3.ఇక కాళ్లూ, చేతులకు

గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి… ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి. పైన చెప్పుకున్న చిన్న, చిన్న చిట్కాలను పాటించినట్లయితే… చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకున్నవారవుతారు.
Share To:

0 comments so far,add yours